: వాట్సాప్ మెసేజ్ పంపడం కన్నా, ఈ-పేమెంట్ ను సులభం చేస్తా: మోదీ
సోషల్ మీడియాలో వాట్సాప్ నుంచి మెసేజ్ ను పంపడం కన్నా ఎలక్ట్రానిక్ చెల్లింపును సులభతరం చేసి చూపిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు భారతీయులంతా మద్దతిచ్చారని ఈ ఉదయం 'మన్ కీ బాత్'లో మోదీ వ్యాఖ్యానించారు. చేతిలో నగదు లేకున్నా, ఇబ్బందులు పడుతున్నా, కోట్లాది మంది డీమానిటైజేషన్ కు మద్దతిచ్చి, తన వెన్నంటి నిలిచారని ఆయన అన్నారు.
నల్లధనాన్ని అక్రమంగా దాచుకునే వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన ఆయన, ప్రజల కష్టాలన్నీ సాధ్యమైనంత త్వరలోనే తీరుస్తామని తెలిపారు. ఏటీఎంలు, బ్యాంకుల నుంచి ఎంత మొత్తం కావాలన్నా తీసుకునే రోజు అతి త్వరలో వస్తుందన్న భరోసా ఇచ్చారు. నగదు రహిత లావాదేవీలకు ప్రజలు సహకరిస్తున్నారని, వారి అవసరాలకు అనుగుణంగానే నిబంధనలు మారుస్తున్నామని, ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.