: అమ్మ మరణంపై ప్రతీకారం తీర్చుకోవడమే మా పార్టీ లక్ష్యం.. జయలలిత కోసం శిలువ వేసుకున్న షిహాన్ హుస్సైనీ ప్రకటన
జయలలిత పేరుతో తమిళనాడు రాజకీయాల్లోకి మరో పార్టీ అరంగేట్రం చేయబోతోంది. 2015లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు ఆమె కేసు నుంచి బయటపడాలని, మళ్లీ సీఎం కావాలంటూ శిలువ వేసుకున్న షిహాన్ హుస్సైనీ అమ్మ పేరుతో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. 'అమ్మ-అమ్మ మక్కల్ మునెట్ర అమైప్పు' అనే పార్టీని ప్రారంభించబోతున్నట్టు పేర్కొన్నారు. అమ్మ మరణంపై ప్రతీకారం తీర్చుకోవడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని హుస్సైనీ స్పష్టం చేశారు.
గతంలో ఎన్నో సాహస కృత్యాలతో రికార్డులు నెలకొల్పిన హుస్సైనీ తనను తాను సంచలన వ్యక్తిగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. కరాటే మాస్టర్ అయిన హుస్సైనీ ఎడమ చేతిపై నుంచి 101 కార్లను నడిపించుకుని రికార్డు సృష్టించారు. తన రక్తంతో జయలలిత చిత్రాన్ని గీసి అమ్మపై తనకున్న వీరాభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగానే తాను పార్టీ స్థాపించాల్సి వస్తోందని హుస్సైనీ పేర్కొన్నారు. జయలలిత గతంలో చాలాసార్లు తనను రాజకీయాల్లోకి రమ్మని పిలిచినా తాను అంగీకరించలేదన్నారు. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో రావాల్సి వస్తోందన్నారు. ఆస్పత్రిలో చేరిన అమ్మకు అసలు ఏమైందో ప్రజలకు వివరించడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్న ఆయన అన్నాడీఎంకేను హస్తగతం చేసుకున్నవారిపైనే తనకు అనుమానం ఉందని వివరించారు.