: అసలు నగదు కొరత ఇంతలా ఎందుకుంది...? ప్రభుత్వం చెబుతున్నవి వాస్తవాలేనా..?
అసలు నగదు కొరత ఇంతలా ఎందుకుంది...? ప్రభుత్వం చెబుతున్నవి వాస్తవాలేనా..? నవంబర్ 8... నేడు డిసెంబర్ 24. నెలన్నర దాటిపోయింది. ప్రజలు ఇప్పటికీ నగదు కొరతతో అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వమేమో తొలుత డిసెంబర్ నెలాఖరుకు పరిస్థితి కుదుటపడుతుందని చెప్పింది. ఇప్పుడేమో జనవరి చివరి వరకు ఆగాలంటోంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య అయితే ఏకంగా ఆరు నెలలకు గానీ పరిస్థితి సాధారణ స్థితికి రాదని కుండబద్దలు కొట్టేశారు. మరి దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం చెబుతున్నవన్నీ కట్టుకథలేనేమో అనిపించక మానదు.
ప్రింటింగ్ ప్రెస్ లు రేయింబవళ్లు నోట్లను ముద్రిస్తున్నా గానీ పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదంటే ప్రభుత్వం తగిన సన్నాహాలు చేయలేదని తెలుస్తోంది. పైగా నవంబర్ 8కి ముందు ముద్రించిన అన్ని నోట్లను రిజర్వ్ బ్యాంకు ఇప్పటికీ వ్యవస్థలోకి వదలలేదన్నది మరో వాస్తవం. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 19 వరకు ఉన్న గణాంకాలను చూస్తే రిజర్వ్ బ్యాంకు 220 కోట్ల నోట్లను విడుదల చేసింది. వీటిలో 90 శాతం రూ.2,000 నోట్లు అనుకుంటే... మిగిలిన పది శాతం రూ.500 నోట్లని తెలుస్తోంది.
దీంతో వీటి మొత్తం విలువ రూ.4.07 లక్షల కోట్లు మాత్రమే. కానీ, సమాచార హక్కు చట్టం కింద తమకు వచ్చిన ఓ దరఖాస్తుకు ఆర్ బీఐ సమాధానమిస్తూ... నవంబర్ 8కి ముందు రూ.2,000 నోట్లను రూ.4.94 లక్షల కోట్ల మేర ప్రింట్ చేసినట్టు సమాధానం ఇచ్చింది. అంటే ముద్రించినవన్నీ ఇంకా వ్యవస్థలోకి రాలేదని తెలుస్తోంది. అంటే ఇంకా రూ.లక్ష కోట్ల మేర రిజర్వ్ బ్యాంకు నగదు ఖజానాల్లో మూలుగుతోంది.
నవంబర్ 8 తర్వాత కూడా ప్రభుత్వం ముమ్మరంగా నోట్లను ముద్రిస్తోంది. నాలుగు ప్రింటింగ్ ప్రెస్ ల సామర్థ్యం ప్రకారం మరో రూ.2 లక్షల కోట్ల మేర నోట్లను ముద్రించి ఉండాలి. ఆర్ బీఐ నవంబర్ 8కి ముద్రించామని చెప్పిన రూ.4.94 లక్షల కోట్లతో కలిపి చూస్తే మొత్తం రూ.7 లక్షల కోట్ల మేర నోట్లు మార్కెట్లోకి వచ్చి ఉండాలి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో జమలు రూ.12.44 లక్షల కోట్ల మేర ఉన్నాయని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ లెక్కన చూస్తే సగానికంటే ఎక్కువే నోట్లు వ్యవస్థలోకి వచ్చాయి. అయినా నగదుకు ఇంత కొరత ఎందుకుంది...?
రూ.2,000 నోట్ల ముద్రణ ముగిసిందని, ప్రస్తుతం రూ.500 నోట్లనే ముద్రిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రెండు ప్రింటింగ్ కేంద్రాల్లో నోట్ల ముద్రణ మూడు వారాలుగా నిదానించినట్టు అధికారిక సమాచారం. నోట్లలో లోపాలు తలెత్తడంతో ముద్రణను వేరే కేంద్రాలకు మళ్లించినట్టు తెలుస్తోంది. వీటన్నింటిని చూస్తే పరిస్థితి కుదుట పడేందుకు నిజంగానే మరోనెల, నెలన్నర పట్టేట్టు కనిపిస్తోంది.