: హైదరాబాద్ లో నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ఒక ముఠాను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కామినేని కూడలి వద్ద ముగ్గురు సభ్యులు ఈ దందాకు పాల్పడుతుండగా పట్టుబడ్డారు. నల్గొండ, హైదరాబాద్ కు చెందిన నవీన్ రెడ్డి, భాను మల్లారెడ్డి, చెరుకు వెంకటేష్ లు నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. నల్గొండ జిల్లా హాలియాలోని కొన్ని గ్రామాల్లో నోట్లు మార్పిడి చేసి తరలిస్తుండగా ఎల్బీనగర్ లో నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి కొత్త రెండు వేల రూపాయల నోట్లు రూ.19.70 లక్షలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.