: రూ. 16 కోట్ల పన్ను కట్టేందుకు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు అంగీకారం
తాను వెనకేసుకున్న నల్లధనంపై నిబంధనలకు అనుగుణంగా పన్ను చెల్లించేందుకు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు అంగీకరించారు. గడచిన మూడు రోజులుగా రామ్మోహన్ రావు ఇంటితో పాటు పలు ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో లెక్కకు చూపని కోట్లాది రూపాయల ధనాన్ని, పెద్ద మొత్తంలో బంగారాన్ని, స్థిర, చరాస్తులను సీబీఐ, ఈడీ అధికారులు గుర్తించారు.
ఆపై తమిళనాడు ప్రభుత్వం రామ్మోహన్ రావును తొలగిస్తూ, గురువారం నాడు ఉత్తర్వులు వెలువరించింది. ఆయన ఇంట్లో సోదాలు ముగిశాయని అధికారులు ఈ ఉదయం ప్రకటించారు. మొత్తం 13 చోట్ల సోదాలు చేశామని, రూ. 16 కోట్ల వరకూ ఆయన పన్ను బకాయి ఉండటంతో అది చెల్లించేందుకు ఆయన అంగీకరించారని, నిబంధనల ప్రకారం కేసు విచారణ జరుగుతుందని వెల్లడించారు.