: 'ఈపీఎఫ్'ను తగ్గించిన కేంద్రం... ఇప్పుడు 'పీపీఎఫ్'పైనా షాకివ్వనుంది!
ఎనిమిదేళ్ల తరువాత తొలిసారిగా ఈపీఎఫ్ (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్)పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ఈ వారం ప్రారంభంలో ప్రకటించిన కేంద్రం, ఇప్పుడు పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలపైనా కన్నేసింది. ఎంతో మంది చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పీపీఎఫ్ ఖాతాల్లో డబ్బు దాచుకుంటుండగా, వీరికి ఇచ్చే వడ్డీపై కోత పెట్టనున్న సంకేతాలను వెలువరించింది. వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని పీపీఎఫ్ పై నియమించిన గోపీనాథ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు మోదీ సర్కారు ఆమోదం పలికితే, ప్రస్తుతం 8 శాతంగా ఉన్న వడ్డీ రేటు ఒక శాతం వరకూ తగ్గి 7 శాతానికి చేరుతుంది. ఇటీవలి కాలంలో 10 ఏళ్ల కాలపరిమితిపై విక్రయించిన ప్రభుత్వ బాండ్లపై రాబడి 6.5 శాతానికి తగ్గిన నేపథ్యంలో, వచ్చే జనవరి - మార్చి త్రైమాసికంలో పీపీఎఫ్ ను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అయితే, ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం పావు నుంచి అర శాతం వరకూ వడ్డీ రేటును తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని టాక్స్ ఎక్స్ పర్ట్ లు అభిప్రాయపడుతున్నారు.