: క్యాబ్ డ్రైవర్ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.7 కోట్లు జమ.. పొంతన లేని సమాధానాలు చెబుతున్న డ్రైవర్!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కూలీలు, పేదల అకౌంట్లలోకి భారీగా నగదు వచ్చి పడుతున్న ఘటనలు ప్రతిరోజు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన బ్రాంచిలో ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంకు ఖాతాలో ఏకంగా 7 కోట్ల రూపాయలు జమ అయినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల ఆ డ్రైవర్ రద్దయిన నోట్లను ఆ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు బ్యాంకుకు వచ్చి ఈ డిపాజిట్ చేసినట్లు తాము సీసీటీవీల ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ అక్రమలావాదేవీ కేసులో క్యాబ్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఐటీ, ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బ్యాంకులో 7 కోట్ల రూపాయలు డబ్బు జమ అయిన వెంటనే డ్రైవర్ తెలివిగా వాటిని బులియన్ ట్రేడర్ ఖాతాలోకి మళ్లించాడని అధికారులు తెలిపారు. అయితే, ఆ డ్రైవర్ మాత్రం అధికారులతో ఆ డబ్బుతో బంగారం కొన్నానని చెప్పాడు. అంతేగాక, అడ్డంగా దొరికిపోయిన అనంతరం ఇప్పుడు ప్రధాన మంత్రి గరీబ్ యోజన కింద పన్ను చెల్లిస్తానని పేర్కొన్నాడు. అతడిపై మనీ లాండరింగ్ అనుమానం వ్యక్తం చేస్తూ ఈడీ అధికారులకు ఐటీ సమాచారం ఇచ్చింది. భారీ మొత్తంలో తమ బ్యాంకులో డబ్బు డిపాజిట్ అయినప్పటికీ ఐటీకి వివరాలు తెలపని బ్యాంకు అధికారులపై కూడా అధికారులు దర్యాప్తు జరిపే అవకాశం ఉంది.