: కుక్కలు కూడా మానసిక ఒత్తిడికి గురవుతాయట.. బొచ్చు కూడా తెల్లబడిపోతుందట!
మనమే కాదండోయ్... మనకు ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కలు కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతాయట. అంతేకాదు, ఒత్తిడి మూలంగా మనలాగానే వాటికి కూడా బొచ్చు ముందుగానే తెల్లబడిపోతుందట. ఓ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కొలరాడోలో 400 ముదురు రంగు కుక్కలపై పరిశోధనలు జరిపారు. ఈ కుక్కలన్నీ కూడా 1 నుంచి 4 ఏళ్ల మధ్య వయసున్నవి. పెద్ద శబ్దాలను చేయడం, భయంతో ఉన్నట్టుగా ప్రవర్తించడం లాంటివి... కుక్కలు మానసిక ఒత్తిడిలో ఉన్నాయని చెప్పడానికి నిదర్శనమని పరిశోధకులు తెలిపారు. మానవులు భయపడినట్టుగానే కుక్కలు కూడా భయపడతాయని చెప్పారు. అంతేకాదు, మగ కుక్కల్లో కంటే ఆడ కుక్కల్లో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందుకే మగ కుక్కలతో పోల్చితే ఆడ కుక్కల్లో బొచ్చు తొందరగా తెల్లబడుతుందని చెప్పారు.