: కరెన్సీ కష్టాల నుంచి యాజమాన్యాలకు ఊరట... వేతన చట్టానికి సవరణ చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్?

నోట్ల రద్దు తరువాత, ఎవరి దగ్గరా కరెన్సీ లేకపోవడంతో వేతనాల చెల్లింపులు కంపెనీల యాజమాన్యాలకు క్లిష్టతరం కాగా, వారిని గట్టున పడేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం సమావేశమైన కేంద్ర క్యాబినెట్, వేతనాల చెల్లింపుల చట్టాన్ని సవరిస్తూ, ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఆమోదం పలికినట్టు సమాచారం. 1936 నాటి ఈ చట్టానికి మార్పులు చేయనున్నామని, ఇప్పటికిప్పుడు లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదం కష్టం కాబట్టి, రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తేనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఏ కంపెనీ యాజమాన్యమైనా, తమ ఉద్యోగులకు వేతనాలను చెక్కులు లేదా ఈ-పేమెంట్ రూపంలో చెల్లించవచ్చు. దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నగదు రహిత చెల్లింపుల వ్యవస్థకు మారేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

వాస్తవానికి ఈ బిల్లును ఈ నెల 15న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ బడ్జెట్ సమావేశాల్లోనే జరిగే వీలుంది. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల పాటు బిల్లు అమలు జాప్యం కావడం ఇష్టంలేని మోదీ సర్కారు, ఆర్డినెన్స్ తేనుంది. కాగా, వేతనాల చెల్లింపులను చెక్కులు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ విధానంలో పూర్తి చేసేందుకు అనుమతి ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, హర్యానా రాష్ట్రాలు ఇప్పటికే తమ తమ రాష్ట్రాల స్థాయిలో చట్ట సవరణ చేసేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఉద్యోగి నుంచి ఆథరైజేషన్ లెటర్ తీసుకున్న తరువాతనే యజమాని అతని వేతనాన్ని చెక్కు ద్వారా లేదా బ్యాంకు ఖాతాలోకి జమ చేసే విధానంలో చెల్లించే వీలుంది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే, యాజమాన్యం తమకు నచ్చిన పద్ధతిలో చెల్లింపులు జరుపుకోవచ్చు.

More Telugu News