: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. జనవరి 1 నుంచే అమలు


రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు నానాపాట్లు పడుతున్న ఇతర టెలికం కంపెనీలు భారీ ఆఫర్లతో దిగివస్తున్న వేళ ప్రభుత్వ రంగ  సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా తమ ఖాతాదారులకు బంపరాఫర్ ప్రకటించింది. రూ.149తో ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరమిత కాల్స్‌తోపాటు ఉచితంగా కొంత డేటాను ఇచ్చే ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 1 నుంచి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ పునరుత్థాన దశలో ఉందని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని, నిర్వహణ లాభాలను ఆర్జిస్తున్నట్టు తెలిపారు. ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థుల పోటీని తట్టుకోలేక ఆరోస్థానానికి  పడిపోయిందని, ఇప్పుడు మళ్లీ నాలుగో స్థానానికి ఎగబాకినట్టు శ్రీవాస్తవ వివరించారు. ప్రస్తుతం 10 శాతం ఉన్న ఖాతాదారులను 15 శాతానికి పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఆయన వివరించారు.  


  • Loading...

More Telugu News