pawan kalyan: సుప్రీంకోర్టు తీర్పును అవమానించారంటూ.. పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
ట్విట్టర్ ద్వారా రోజుకో అంశంపై స్పందిస్తూ బీజేపీపై విమర్శల జల్లు కురిపిస్తోన్న జనసేనాని, సినీ హీరో పవన్ కల్యాణ్ నిన్న పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ గడపాల్సిన సాయంకాలాన్ని 'దేశభక్తి'ని నిరూపించుకునే పరీక్షకు వేదికగా మార్చడమేంటని, సినిమా థియేటర్‌లలోనే జాతీయగీతాన్ని పాడాలని ఎందుకు చెబుతున్నారని పవన్ ప్రశ్నించారు.
అయితే, ఇదే అంశంపై హైదరాబాద్ లోని సరూర్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఈ రోజు ఆయనపై కేసు నమోదైంది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పవన్ కల్యాణ్ అవమానించారంటూ హైకోర్టు న్యాయవాది జనార్దన్ గౌడ్ ఈ కేసును పెట్టారు. పవన్ ట్విట్టర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అవమానించారని ఆయన పేర్కొన్నారు. దేశ పౌరుల్లో జాతీయగీత వ్యతిరేక ప్రచారం వంటి చర్యలకు పాల్పడుతూ పవన్ కల్యాణ్ రెచ్చగొడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.