: స్కూల్ బస్సులో.. తర్వాత కారులో విద్యార్థినిపై తోటి విద్యార్థుల అకృత్యం

స్కూల్ సమీపంలోనే స్కూల్ బస్సులో తోటి విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు లైంగిక అకృత్యానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానే పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు ఇద్దరు విద్యార్థులతోపాటు, బస్సు యజమానిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను పోలీసులు ఈ రోజు మీడియాకు వెల్లడించారు. 14 ఏళ్ల బాలిక ఈ నెల 15న స్కూల్లో అందరికంటే తొందరగా పరీక్ష రాసేసి వెళ్లి స్కూలు బస్సులో కూర్చుంది. ఆ బస్సులో మరో విద్యార్థిని కూడా ఉంది. ఆ తర్వాత అదే తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు బస్సులోకి ప్రవేశించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు.

 ఇది చూసి అక్కడే ఉన్న మరో విద్యార్థిని భయంతో పరారైంది. తొలుత బస్సులో వేధింపులకు గురి చేసిన తర్వాత ఆ బాలికను ఇద్దరు విద్యార్థులు పక్కనే ఉన్న మరో కారులోకి బలవంతంగా తీసుకెళ్లారు. బస్సు డ్రైవర్ కారును నడుపుతుండగా... ఆమెపై వారు తమ లైంగిక దాడిని కొనసాగించారు. స్కూల్ బస్సు నుంచి పరారైన మరో విద్యార్థిని జరిగిన విషయాన్ని టీచర్ కు చెప్పడంతో వారు విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు ఇద్దరు విద్యార్థులను, బస్సు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

More Telugu News