: కేటీఆర్, హరీశ్ ల మధ్య విభేదాలున్నాయి... సమస్యలను కూడా ఒకరిపై మరొకరు తోసేసుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వంపైన, మంత్రులపైన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభలో ఈ రోజు కత్తిపోటీలు, మల్లయుద్ధం వంటివి జరుగుతాయేమోనని హరీశ్ రావు అనుకున్నట్టున్నారని, అందుకే తమను సస్పెండ్ చేసినట్టున్నారని... మందబలంతో శాసనసభలో నెగ్గలేరని అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన షార్ట్ డిస్కషన్స్ లో లోపాలను ఎత్తిచూపితే... ఇంతవరకు ముఖ్యమంత్రి నుంచి సమాధానం కూడా లేదని ఎద్దేవా చేశారు. సినీనటుడు నాగార్జున చెరువును కబ్జా చేసి ఫంక్షన్ హాలును కట్టుకున్న వ్యవహారాన్ని కేటీఆర్ పై తోసేసి హరీశ్ రావు తప్పించుకున్నాడని ఆరోపించారు.
బావా బావమరుదులు కేటీఆర్, హరీష్ ల మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చని... కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా వీరు ఒకరిపై మరొకరు తోసేసుకుంటున్నారని... దీంతో, వీరీ కుటుంబ బండారం అంతా ప్రజలకు తెలసిపోతోందని ఎద్దేవా చేశారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలసినప్పుడు కేటీఆర్, హరీశ్ ల పంచాయితీకి వెళ్లొస్తున్నామని... చెరువులు నా శాఖ పరిధిలోకి రానప్పటికీ, నాగార్జున చెరువు కబ్జా విషయాన్ని నామీదకు ఎందుకు తోసేశావంటూ హరీశ్ ను కేటీఆర్ ప్రశ్నించినట్టు వారు తనతో చెప్పారని రేవంత్ తెలిపారు.