: భారీ మార్పులు చేసిన పాక్ ఆర్మీ కొత్త చీఫ్.. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ చీఫ్‌గా నవీద్ ముక్తర్
పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తర్‌ను నియమించినట్లు పాక్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎస్ఐ చీఫ్‌గా కొత్తగా నియమితుడైన నవీద్‌కు ఇంటెలి జెన్స్ రంగంలో ఎంతో అనుభవం ఉందని చెప్పింది. రెండు వారాల క్రితం జనరల్ రహీల్ షరీఫ్ స్థానంలో ఆర్మీ చీఫ్‌గా జావేద్ బజ్వా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఆ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన ఆ దేశ సైన్యంలో కీలక మార్పులు చేపట్టారు. లెఫ్టినెంట్ జనరల్‌గా పదోన్నతి పొందిన బిలాల్ అక్బర్‌ను జనరల్ స్టాఫ్ చీఫ్‌గా, ఎన్డీయూ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నజీర్ బట్‌ను పెషావర్ కార్ప్స్ కమాండర్‌గా, లెఫ్టినెంట్ జనరల్ హిదాయత్ ఉర్ రెహ్మాన్‌ను జనరల్ హెడ్ క‍్వార్టర్స్‌లో ఐజీటీఈగా నియమిస్తూ ఆయన తమ మిలటరీలో భారీ మార్పులు చేశారు.