: మరోసారి మంట పుట్టించనున్న పెట్రోల్... త్వరలో లీటర్ రూ.80కి


పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మరోసారి భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడేళ్లకు పైగా పడకేసిన ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్రమంగా పెరుగుతున్నాయి. చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్ చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి చమురు ధర పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 53 డాలర్ల స్థాయిలో ఉంది. ఇది కనుక 60 డాలర్లకు చేరితే... దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 80 రూపాయలు, 68 రూపాయల స్థాయికి చేరతాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే చమురులో ఓపెక్ దేశాల వాటా మూడింట ఒక వంతు ఉంటుంది. కాగా, ఓపెక్ పరిధిలో లేని చమురు దేశాలు సైతం కొంత మేర ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 55 డాలర్ల స్థాయికి చేరుతుందని, కొందరు అంచనా వేస్తున్నట్టు 60 డాలర్లకు చేరితే గనుక దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పైన చెప్పుకున్న స్థాయికి పెరుగుతాయని క్రిసిల్ తన నివేదికలో వివరించింది.

  • Loading...

More Telugu News