: కుప్పకూలిన చర్చి పైకప్పు... 60 మంది సజీవ సమాధి
ఆగ్నేయ నైజీరియాలోని ఉయో ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ప్రార్థనల సమయంలో ఓ చర్చి పై కప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 60 మంది ప్రాణాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి. సహాయక సిబ్బంది 60 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, మరింత మంది మరణించి ఉండవచ్చనే సమాచారం వినిపిిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో చర్చిలో వందల సంఖ్యలో ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మాణ దశలో ఉన్న ఈ చర్చిని ప్రత్యేక ప్రార్థనల కోసమని వేగంగా ముగించేసినట్టు సమాచారం. కాగా, భద్రతా ప్రమాణాలను గాలికొదిలేశారా అన్న విషయమై దర్యాప్తు చేస్తామని రాష్ట్ర గవర్నర్ ఉదోమ్ ఎమాన్యుయేల్ ప్రకటించారు. ఈ దుర్ఘటన పట్ల దేశాధ్యక్షుడు ముహమ్మద్ బుహారి విచారం వ్యక్తం చేశారు.