: త్యాగిని అధికారికంగా కలవలేదు, మాట్లాడలేదు: ‘అగస్టా’ కుంభకోణంలో కీలక మధ్యవర్తి మైఖేల్
వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని తాను అధికారికంగా కలవలేదని, మాట్లాడలేదని ‘అగస్టా’ కుంభకోణంలో కీలక మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మైఖేల్ తెలిపాడు. అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాఫ్టర్ల కుంభకోణంలో త్యాగితో పాటు ఆయన కజిన్ సంజీవ్ అలియాస్ జూలీ త్యాగి, ఢిల్లీ న్యాయవాది గౌతమ్ ఖైతాన్ లను సీబీఐ ఈరోజు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణం ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మైఖేల్ మీడియాతో మాట్లాడుతూ, నాడు జరిగిన ఒక పార్టీలో జూలీ త్యాగిని మాత్రమే తాను కలిశానని, ఆ సమయంలో తనకు ఒక వ్యక్తిని పరిచయం చేశారని చెప్పారు. పరిచయమైన వ్యక్తి శక్తి వనరుల రంగంలో పనిచేస్తున్న ప్రభావశీలమైన వ్యక్తి అని చెప్పారు. తమ కంపెనీ తరపున తాను మధ్య వర్తిగా పనిచేస్తున్న సమయంలో ఎస్పీ త్యాగిని అధికారికంగా మాట్లాడటం కానీ, కలవటం కానీ జరగలేదని మైఖేల్ పేర్కొన్నారు.