: జగన్ నాగరిక భాషను నేర్చుకోవాలి, ట్యూటర్‌ను పెడతాం: ఏపీ మంత్రి పల్లె
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తన భాష తీరును మార్చుకోవాలని సూచించారు. ఆయన భాష తీరుతో తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని, ఆయన మాట్లాడే భాష రౌడీలు, గూండాలు మాట్లాడే భాషలా ఉందని పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ నాగరిక భాష నేర్చుకోవాలని, అందుకోసం కావాలంటే తాము ట్యూటర్‌ను కూడా పెడతామని చమత్కరించారు. జగన్ చేస్తోన్న వ్యాఖ్యలు రాజకీయ నాయకులను ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయని ఆయన అన్నారు.