: ప్లాస్టిక్ నోట్లను తీసుకొస్తున్నాం.. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటన


పెద్దనోట్లను రద్దు చేసినందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వంపై విప‌క్ష పార్టీల నేత‌లు ఎన్నో విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం న‌ల్ల‌ధ‌నాన్ని, న‌కిలీ నోట్ల‌ను అరికట్టే క్ర‌మంలో ఎవ‌రిమాటా విన‌డం లేదు. ఒక బిలియన్‌ 10 రూపాయల ప్లాస్టిక్‌ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వం 2014 ఫిబ్రవరిలోనే పార్లమెంట్‌కు తెలిపిన విష‌యం తెలిసిందే. దీనిపై లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత‌లు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేగ్వాల్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తాము ప్లాస్టిక్‌ లేదా పాలిమర్‌ నోట్లను ముద్రించేందుకు నిర్ణయించినట్లు స్ప‌ష్టం చేశారు. నోట్ల నాణ్యతను మరింతగా బలోపేతం చేయడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు మేగ్వాల్ పేర్కొన్నారు. ఇందుకోసం తాము చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఈ నోట్లను ముద్రించేవారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నోట్ల ముద్ర‌ణ‌లో ఎలాంటి త‌ప్పులు దొర్ల‌కుండా ఉండేందుకు వారికి ఈ శిక్ష‌ణనిస్తున్న‌ట్లు చెప్పారు. మ‌రో విష‌యాన్ని గురించి మాట్లాడుతూ గ‌త ఏడాది సెక్యూరిటీ రిబ్బన్‌ లేకుండా నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌లో ముద్రించిన రూ.1000 నోట్లలో కొన్ని వెనక్కి వచ్చినట్లు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ దృష్టికి తీసుకొచ్చింద‌ని అన్నారు. ఈ నోట్లు హోషంగాబాద్‌లోని సెక్యూరిటీ పేపర్‌ మిల్‌ సరఫరా చేసిన కాగితంపైనే ముద్ర‌ణ అయిన‌ట్లు చెప్పారు. ఒక బిలియన్‌ 10 రూపాయల ప్లాస్టిక్‌ నోట్లను కొచ్చి, మైసూరు, జయపుర, షిమ్లా, భువనేశ్వర్‌ నగరాల్లో మొద‌ట ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌భుత్వం తెలిపింది. ఈ నోట్ల‌ సగటు జీవితకాలం కేవ‌లం ఐదు ఏళ్లు మాత్రమే. ఈ నోట్ల‌కు నకిలీ నోట్లను ముద్రించ‌డం ఎవ‌రిత‌రం కాదు. ప్ర‌స్తుతం ఉన్న‌ పేపర్‌ కరెన్సీ కంటే ఈ నోట్లు శుభ్రంగా కూడా ఉంటాయి. త‌మ దేశంలో నకిలీ నోట్లను అరికట్టడానికి ఆస్ట్రేలియా ఇప్ప‌టికే ప్లాస్టిక్‌ నోట్లను ప్ర‌వేశపెట్టింది.

  • Loading...

More Telugu News