: వాయిదాల పర్వం .. రాజ్యసభ రెండున్నరకు వాయిదా
రాజ్యసభలో రోజూ కనిపించే దృశ్యమే నేడు కూడా దర్శనమిచ్చింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు డీమానిటైజేషన్ పై తమ అభిప్రాయాలు వినేందుకు ప్రధాని పార్లమెంటుకు రావాలంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడం లేదు. దీంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు జరుగుతున్న తీరుతెన్నులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది విధానం కాదంటూ విపక్షాలను మందలించారు. అలాగే బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ కూడా మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి రోజులను తాను చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రధాని రాజ్యసభకు ఈ రోజు కూడా హాజరుకాలేదు, విపక్షాలు ఆందోళన ఆపలేదు. దీంతో నేడు కూడా రాజ్యసభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2:30 నిమిషాలకు వాయిదా వేస్తూ రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ నిర్ణయం తీసుకున్నారు.