: జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయి: ప్రధానికి సంచలన లేఖ రాసిన నటి గౌతమి
కమలహాసన్ నుంచి ఇటీవల విడిపోయిన నటి గౌతమి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి సంచలనం సృష్టించారు. జయలలిత ఆసుపత్రిలో చేరిన తరువాత, అక్కడ కోలుకున్నట్టు చెప్పారని, అంతలోనే మరణించినట్టు ప్రకటన వెల్లడించారని చెబుతూ, ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్నీ రహస్యంగా ఉంచారని గౌతమి ఆరోపించారు. వీఐపీలు వచ్చినా ఆమె దగ్గరికి వెళ్లనీయలేదని గుర్తు చేశారు. కాగా, జయలలిత అనారోగ్యం, అపోలో ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరిగిన తీరు తదితరాలపై మనసులో ఉన్న అనుమానాలను బయటకు చెప్పడంలో ఎంతో మంది వెనుకంజ వేస్తున్న వేళ, గౌతమి ఏకంగా ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. అసలు అమ్మ ఆరోగ్యం విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటించారని ప్రశ్నిస్తూ, ఆమెకు జరిగిన చికిత్సపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని, వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. మోదీ తన ఆవేదనను పట్టించుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.