: ట్విట్టర్ వేదికగా అభిమానుల కామెంట్లు, రివ్యూ: 'ధృవ' ఫస్టాఫ్ ఓకే... సెకెండాఫ్ కూడా అలాగే ఉంటే బాగుండేది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ధృవ' ఓవర్సీస్ లో విడుదలైంది. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో 'ధృవ' సినిమా ఎలా ఉంది? అన్నదానిపై సోషల్ మీడియాలో అభిమానులు స్పందించారు. తమిళంలో అద్భుత విజయం సాధించిన 'తని ఒరువన్' సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అభిమానుల అభిప్రాయాల ప్రకారం... రామ్ చరణ్ నుంచి ఆశించే అంశాలతోపాటు, ప్రమోషన్ లో హీరో చెప్పిన అంశాలతో ధియేటర్ లో అడుగుపెట్టిన అభిమానులను దర్శకుడు సురేందర్ రెడ్డి ఆకట్టుకున్నాడు. అతని దర్శకత్వ ప్రతిభకు తోడు రామ్ చరణ్ నటన మరింత ఆకట్టుకుంది. ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకున్న రామ్ చరణ్, సురేందర్ రెడ్డిల కాంబినేషన్ ద్వితీయార్థం వచ్చేసరికి తేలిపోయిందని తెలుస్తోంది. ప్రధమార్థం బాగున్నంతగా ద్వితీయార్థం లేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. కడపలో రామ్ చరణ్ అభిమానులు తొలి సగం చూశామని, బాగుందని, రెండో సగం కూడా ఇలాగే వుంటే సినిమా సూపర్ హిట్టేనని పేర్కొన్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలు విజయవంతమైన నేపథ్యంలో స్టార్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్న రామ్ చరణ్ సినిమాకు ఈ రకమైన వ్యాఖ్యలు నిరాశను కలిగిస్తాయని చెప్పచ్చు. దీనికి తోడు తెలుగులో స్టార్ హీరో సినిమాకు తొలి రోజు టికెట్లు దొరకడం అనేది సుదీర్ఘ కాలం తరువాత ఈ సినిమాకే జరగడం విశేషం. ఆన్ లైన్ లో తొలిరోజు షోలకు టికెట్లు ఇంకా లభ్యమవుతుండడం విశేషం. దీనికంటే తమిళ సినిమాయే బాగుందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే పాటలు, సినిమాటోగ్రఫీ, రామ్ చరణ్ నటన బావున్నాయని అంతా చెప్పడం విశేషం. రికార్డులు, ఇతర విషయాల సంగతి మర్చిపోతే సినిమా ఆకట్టుకుంటుందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ఈ సినిమా మరికాసేపట్లో 1500 థియేటర్లలో విడుదల కానుంది.