: సుష్మా స్వరాజ్ కు దొరికిన కిడ్నీ దాత... ఈ వారంలోనే ఆపరేషన్
కిడ్నీలు పాడైపోయి, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు కిడ్నీ దాత దొరికినట్టు తెలుస్తోంది. ఆమెకు సరిపడే బ్లడ్ గ్రూప్ దాత లభించాడని, ఈ వారాంతంలోనే ఆమెకు కిడ్నీ మార్పిడి జరుగుతుందని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ దాతకు ఆమెతో ఎలాంటి బంధుత్వమూ లేదని తెలిపారు. ఆమె బంధువర్గం, దగ్గరి స్నేహితులు, అభిమానులు ఎంతో మందిని పరిశీలించినా కిడ్నీ సరిపడలేదని, ఎలాంటి బంధుత్వం లేని వ్యక్తి కిడ్నీ సరిపడిందని తెలిపారు. ఆసుపత్రి ఆధరైజేషన్ కమిటీ నుంచి క్లియరెన్స్ రాగానే సుష్మకు ఆపరేషన్ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రొసీజర్ పూర్తయిందని వివరించారు. ఇద్దరికీ కలిపి చేయాల్సిన పరీక్షలు కూడా చేసి రిపోర్టులను ఉన్నతాధికారులకు అందించామని వెల్లడించారు. ఎయిమ్స్ డాక్టర్లే ఈ శస్త్రచికిత్స చేస్తారని తెలిపారు. కాగా, వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో గత నెల రెండో వారం నుంచి సుష్మా స్వరాజ్ ఆసుపత్రికే పరిమితమైన సంగతి తెలిసిందే.