: సుమత్రాను కుదిపేసిన భారీ భూకంపం... వేలాది మంది శిధిలాల కింద
ఇండోనేషియా సమీపంలోని సుమత్రా దీవులు కేంద్రంగా ఈ ఉదయం 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపం, మొత్తం దేశాన్ని కుదేలు చేసింది. వందలాది భవనాలు నేలమట్టం కాగా, కిలోమీటర్ల కొద్దీ రహదారులు ధ్వంసమయ్యాయి. భూకంపం కారణంగా భవనాలు కూలి 18 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. వేలాది మంది గాయపడగా, క్షతగాత్రుల రోదనలతో ఆసుపత్రులన్నీ మారుమోగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని సమాచారం. శిధిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు జాతీయ విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దిగాయి. 33 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉండగా, దీని కేంద్రానికి 800 కిలోమీటర్ల దూరం వరకూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే, సునామీ హెచ్చరికలను మాత్రం జారీ చేయలేదు.