: 20 మందిని లాగితే చాలు... తమిళనాడులో అధికారం తారుమారు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో... ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జయలలిత మరణంతో ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఆమె ప్రధాన అనుచరుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టినా... జయకు ఉన్న ప్రజాకర్షణలో పన్నీర్ సెల్వం ఒక వంతు కూడా సాటిరారు. జయ ఉన్నంత కాలం అన్నాడీఎంకేలోని మరే ఇతర నేత కూడా ఆమె దరిదాపుల్లోకి రాలేకపోయారు. విషయానికి వస్తే... తమిళనాడు అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య 234. ఇందులో అధికార అన్నాడీఎంకే బలం 134 కాగా... విపక్ష డీఎంకే, కాంగ్రెస్ కూటమి బలం 98. అధికారంలోకి రావాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే, డీఎంకే కూటమి మరో 20 మంది ఎమ్మెల్యేలను లాగేస్తే చాలు.... మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టే. ఇప్పుడు ఈ చిన్న అంశమే... తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చను లేవదీస్తోంది. ఇంతకాలం జయలలిత కనుసైగలకు అనుగుణంగా భయపడో, భక్తితోనే ఉన్న పలువురు అన్నాడీఎంకే నేతలకు... ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టైంది. ఇదే అంశాన్ని బేస్ గా చేసుకుని... విపక్ష డీఎంకే పావులు కదిపే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలలో చీలిక తెచ్చో, తాయిలాలు ఇచ్చో వారిని లాక్కోవడానికి డీఎంకే కచ్చితంగా ప్రయత్నిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు, పన్నీర్ సెల్వం, జయ స్నేహితురాలు శశికళల మధ్య చిన్న విభేదం తలెత్తినా... డీఎంకే పని మరింత సులువవుతుంది. ఇదే జరిగితే, తమిళనాడులో అధికార మార్పిడి జరిగినట్టే. ఒకవేళ ఇదే జరిగితే... కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది.