: ‘అమ్మ’ అభిమానుల రోదనలతో దద్దరిల్లుతున్న చెన్నయ్ అపోలో ఆసుపత్రి ప్రాంగణం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడం, కాసేపట్లో ఓ స్పష్టమైన ప్రకటన వస్తుందని తెలియడంతో అపోలో ఆసుపత్రి ప్రాంగణం ఆమె అభిమానుల రోదనలతో దద్దరిల్లుతోంది. కాసేపట్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అక్కడికి వచ్చిన అనంతరం ఓ ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. వెంకయ్యతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడకు చేరుకుంటున్నట్లు సమాచారం. అయితే, నిన్న సాయంత్రం నుంచి ఎంతో ఆవేదనతో ఉన్న ఆమె అభిమానుల్లో కొద్దిసేపటి క్రితం ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. తీవ్రంగా విలపిస్తూ కొందరు ఆసుపత్రిపై రాళ్లు విసిరి, అక్కడ ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వెంటనే స్పందించిన పోలీసులు మెరుపువేగంతో అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. మీడియా ప్రతినిధులను కూడా దూరంగా వెళ్లిపోమని ఆదేశించారు. తమకు సహకరించాలని అక్కడున్న వారందరిని పోలీసులు కోరారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ మళ్లీ కార్యకర్తలు చెలరేగకుండా ఉండడానికి పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఇప్పటికే 9 పారామిలటరీ టీమ్‌లు చెన్నయ్‌కి చేరుకున్నాయి.