: గుండెపోటుతో మృతి చెందిన జయలలిత అభిమాని
చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వచ్చిన వార్తలను చూసిన ఆమె అభిమాని, అన్నాడీఎంకే కార్యకర్త నెలగందన్‌కు గుండెపోటు వచ్చింది. టీవీల్లో న్యూస్ చూస్తూ గుండెపోటుకు గురై తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయనను గమనించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు. నెలగందన్ కడలూరు జిల్లా గాంధీ నగర్‌కు చెందిన వ్యక్తి. డాక్టర్లు నెలగందన్ మృతి చెందినట్లు నిర్ధారించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ... జయలలిత ఆరోగ్యపరిస్థితి విషమించిందని తెలియగానే ఆయన కుప్పకూలిపోయాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన పుకార్లను నమ్మిన ఓ అన్నాడీఎంకే కార్యకర్త కోయంబత్తూర్‌లో గత నెల 6వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.