: జయలలితకు గుండెపోటు, మళ్లీ ఐసీయూకు తరలింపు


అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సాధారణ వార్డు నుంచి అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)కు తరలించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హృద్రోగ, శ్వాసకోశ నిపుణులు జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు తరలివచ్చారు. గత సెప్టెంబర్‌ 22న డీహైడ్రేషన్‌, తీవ్ర జ్వరం, మొదలైన రుగ్మతల కారణంగా స్థానిక గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన అవయవ ఇన్ఫెక్షన్‌ చికిత్సా నిపుణుడు డాక్టర్‌ పీలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, సింగపూర్‌ ఫిజియో థెరపీ వైద్యులు ఇచ్చిన చికిత్స కారణంగా ఆమె కోలుకోవడంతో గత 19న ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు మార్చారు. కాగా, గత రెండు నెలలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె త్వరలో ఇంటికి చేరుకుంటారని భావిస్తున్న సమయంలో మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో అన్నాడీఎంకే నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. జయలలిత అనారోగ్య పరిస్థితి తెలిసి మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.

  • Loading...

More Telugu News