: గుంటూరు జిల్లాలో ఘాతుకం..లారీ డ్రైవర్ గొంతు కోసేసిన నైజీరియా విద్యార్థులు!
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం లోని వడ్డేశ్వరంలో నైజీరియా విద్యార్థులు ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు నైజీరియన్ విద్యార్థులు కేఎల్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. వడ్డేశ్వరంలోని ఒక వైన్ షాపుకు వెళ్లిన ఈ విద్యార్థులు సునీల్ అనే లారీ డ్రైవర్ తో ఘర్షణ పడ్డారు. బాగా మద్యం సేవించి ఉన్న ఈ విద్యార్థుల్లో ఒకరు తన వద్ద ఉన్న కత్తితో సునీల్ గొంతును కోసేశాడు. దీంతో, ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే, ఈ సంఘటనతో ఆగ్రహించిన స్థానికులు, నైజీరియా విద్యార్థులను వెంబడించటంతో వారు తమ గదుల్లోకి వెళ్లి దాక్కున్నారు. దాంతో వారిని బయటకు లాక్కొచ్చే ప్రయత్నాల్లో స్థానికులుండగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. తమ గ్రామస్తుడి గొంతు కోసిన ఆ విద్యార్థులను ఎలా రక్షిస్తారంటూ స్థానికులు పోలీసులపై ఆగ్రహించారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, బాధిత యువకుడిని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.