: టోల్‌గేట్ల వద్ద మొదలైన చిల్లర కష్టాలు.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు
టోల్‌గేట్ల వద్ద మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల సడలించిన ట్యాక్స్ నిబంధనను గత అర్ధరాత్రి నుంచి ఎత్తేశారు. దీంతో పాత రూ.500 నోట్లకు కాలం చెల్లినట్టయింది. టోల్ వసూళ్లు మళ్లీ యథావిధిగా ప్రారంభం కావడంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. గతకొన్ని రోజులుగా రయ్‌మంటూ దూసుకుపోయిన వాహనదారులు ఇప్పుడు ఆగి ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. అయితే ప్రతి ఒక్కరి దగ్గర రూ.2 వేల నోటే ఉండడంతో మరోమారు కష్టాలు ఎదురవుతున్నాయి. చిల్లర కోసం టోల్ సిబ్బందికి, వాహనదారులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీంతో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. కీసర టోల్ గేట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు అన్ని టోల్‌గేట్ల వద్ద ఇదే పరిస్థితి ఉంది.