: ‘క్రీడాకారులు ప్రయాణిస్తోన్న విమాన ప్రమాదం’ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిణిని చంపేస్తామంటూ బెదిరింపులు
కొన్ని రోజుల క్రితం లామియా విమానం కొలంబియాలో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తోన్న ఫుట్‌బాల్ క్రీడాకారులతో సహా మొత్తం 71 మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ విమాన ప్రమాదానికి కారణం అందులో ఇంధనం తక్కువగా ఉండడమేనని తెలిసింది. అయితే, ఈ నేపథ్యంలో కొలంబియా ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిణి యనెత్ మోలినాకు బెదిరింపులు వస్తున్నాయి. ఆమెను చంపేస్తామని పలువురు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ ప్రమాదం జరగడానికి ఆమె నిర్లక్ష్యం కూడా కారణమని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. విమానం ప్రమాదానికి గురవకుండా తన వంతు ప్రయత్నం తాను చేశానని, అయితే తాను ఎంతగా ప్రయత్నించినప్పటికీ దురదృష్టవశాత్తూ విమానం కూలిపోయిందని యనెత్ మోలినా అన్నారు. ఆ విమానంలో ఇంధనం తక్కువగా ఉందని తమకు సమాచారం వచ్చినప్పటికీ వారు 'అత్యవసర పరిస్థితి' అని ఏటీసీకి చెప్పకపోవడంతో విమానం ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఇంతలోనే తమ విమానం నుంచి ఇంధనం లీకవుతోందని తమకు మరో విమాన ఫైలట్ నుంచి కాల్ వచ్చిందని, దాంతో తాము ఆ విమానం ల్యాండింగ్‌కి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు ఫుట్‌బాల్ క్రీడాకారులతో బ్రెజిల్ నుంచి వస్తోన్న విమానంలో ఎలక్ట్రికల్ సమస్య తలెత్తడంతో ఆ విమాన పైలట్ కంట్రోల్ టవర్‌ను సంప్రదించాడని అన్నారు. దీంతో ఆ విమానం ల్యాండింగ్‌కి కూడా అనుమతి ఇచ్చామని చెప్పారు. అయితే ఆ విమానం ల్యాండ్ అయ్యేలోపే కూలిపోయిందని వివరించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రీడాకారుల మృతదేహాలు అధికారులకు లభ్యమయ్యాక చాపికోయెన్స్ క్లబ్ యాజమాన్యం లామియా విమాన సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.