: గొడవ పెట్టుకోవడం ఒక్కనిమిషం పని.. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు తెంచుకోవడం తేలికైన పనే: చంద్రబాబు
అనంతపురం జిల్లా గొల్లపల్లిలో పర్యటిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి భయపడుతున్నానని, రాజీ కుదుర్చుకున్నానని కొందరు అంటున్నారని, తాను ఎన్నడూ ఎవ్వరికీ భయపడలేదని, భయపడబోనని చంద్రబాబు అన్నారు. గొడవ పెట్టుకోవడం ఒక్క నిమిషం పని అని, కేంద్రప్రభుత్వంతో సంబంధాలు తెంచుకోవడం తేలికైన పనేనని, అయితే, రాష్ట్రానికి అది మంచిది కాదని చెప్పారు. ప్రత్యేక హోదాకు బదులుగా తాను ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నది రాష్ట్రప్రయోజనాల కోసమేనని అన్నారు. తాను కష్టపడేది, అధికారులతో పనిచేయించేది ప్రజల కోసమేనని చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే ఏడాది గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా అనంతపురానికి నీరు తీసుకువస్తామని చెప్పారు. మొత్తం 80 టీఎంసీల నీళ్లు అనంతపురానికి తీసుకొస్తామని చెప్పారు. ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలకు నీరందిస్తామని చెప్పారు. రాష్ట్రప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పారు. పేదవారికి అండగా నిలవాలన్నదే తమ ప్రభుత్వధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాము పడుతున్న కష్టాలనుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే టీడీపీకి ఓట్లు వేశారని, వారి సంక్షేమం కోసమే తాను కృషి చేస్తున్నానని అన్నారు.