: ప‌శ్చిమ‌బెంగాల్‌లోనే కాదు యూపీ, జార్ఖండ్ రాష్ట్రాలకూ సైనికులు వెళ్లారు: లోక్ సభలో పారికర్


పార్లమెంటు ఉభయసభలు ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌గేట్ల వద్ద కేంద్ర ప్రభుత్వం సైనికులను మోహరించడాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తోన్న‌ తృణమూల్ కాంగ్రెస్ నేత‌లు ఈ రోజు ఈ అంశాన్ని లోక్‌స‌భ‌లో లేవ‌నెత్తారు. ఈ అంశంపైనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికీ త‌మ‌ రాష్ట్ర‌ సచివాలయంలోని తన చాంబర్‌లోనే ధర్నా చేస్తున్నారని టీఎంసీ లోక్‌స‌భ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇవ్వ‌కుండానే కేంద్ర ప్ర‌భుత్వం బ‌ల‌గాలను మోహ‌రింప‌జేసింద‌ని ఆయ‌న అన్నారు. తృణ‌మూల్ స‌భ్యుడి వ్యాఖ్య‌ల‌ప‌ట్ల ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌ పారికర్ స‌మాధానం ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తనకు చాలా బాధ క‌లిగిస్తున్నాయ‌ని పారికర్ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీది రాజకీయ ఫ్రస్ట్రేషన్‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. భార‌త సైన్యంపై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని, ఆ రాష్ట్రంలో ఆర్మీ చేస్తున్న త‌నిఖీలు సాధార‌ణ సోదాల్లో భాగ‌మేన‌ని ఎన్నో ఏళ్లుగా ఇది కొనసాగుతూనే ఉందని పారిక‌ర్ అన్నారు. 15 ఏళ్లుగా భారత ఆర్మీ ఇటువంటి చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉంద‌ని, ఇదేమీ కొత్త కాదని చెప్పారు. గత ఏడాది నవంబర్ 19-21 తేదీల మధ్య కూడా ఇలా జరిగిందని వివ‌రించారు. ఆ రాష్ట్రంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ఈస్ట్రన్ కమాండ్ వెళుతుంద‌ని పారికర్ చెప్పారు. ప‌శ్చిమ‌ బెంగాల్‌లోనే కాకుండా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా బ‌ల‌గాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో సంబంధిత అధికారులకు ఈ అంశంపై సమాచారం ఇచ్చార‌ని చెప్పారు. ఈ ఎక్స‌ర్‌సైజ్ లను గ‌త నెల‌ 28, 29, 30 తేదీలలో చేద్దామని సైన్యం భావించింద‌ని, అయితే అధికారులు ఈ అంశంపై ఆయా రాష్ట్రాల అధికారుల‌ను సంప్రదిస్తే భారత్ బంద్ నేప‌థ్యంలో తేదీలు మార్చి చెప్పారని వివ‌రించారు. దీంతో సైన్యం ఇప్పుడు ఆయా ప్రాంతాల‌కు వెళ్లిందని చెప్పారు. సైన్యం ఒంట‌రిగా కాకుండా పోలీసులతో కలిసే ఆయా ప్రాంతాల్లో ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. ఇటువంటి విష‌యాల‌ను వివాదాస్పదం చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News