: తెలంగాణ పౌరసరఫరాల శాఖలో నగదు రహిత విధానం అమలుకు కసరత్తు
తెలంగాణ పౌరసరఫరాల శాఖలో నగదు రహిత విధానం అమలుకు కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు సంబంధిత శాఖాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో నగదు రహిత విధానం ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆ శాఖ అధికారులు ఈరోజు ఒక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని పౌరసరఫరాల శాఖ భవన్ లో కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. రేషన్ షాపుల్లో ఈ విధానం అమలుకు సంబంధించి బ్యాంకర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో నగదు రహిత పద్ధతిలో రేషన్ పంపిణీకి సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు.