: కేసీఆర్ వైఖరి మారింది.. నోట్ల రద్దుకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు బాధాకరం: చాడ వెంకట్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరి మారిందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. నోట్ల రద్దుకు అనుకూలంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... డబ్బులు లేక అన్ని రకాల కొనుగోళ్లు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల డబ్బంతా విదేశాల్లో మూలుగుతుంటే... దేశంలోని సామాన్యులకు ఈ కష్టాలేంటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత డబ్బు వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాలను పెంచాలని కోరారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి అమలు చేయకపోతే... రానున్న రోజుల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.