: చిల్లర లేదని తప్పించుకోలేరు.. 500 ఈ-చలాన్ పరికరాలను కొనుగోలు చేసిన ట్రాఫిక్ పోలీసులు
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరతతో బాధపడుతున్న ప్రజల జేబులో ఏటీఎం కార్డులు తప్పా డబ్బు ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో వారు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను తీసుకొని రోడ్డపై తిరుగుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే? జరిమానా కట్టడానికి డబ్బు లేదని చెప్పేస్తున్నారు. అయినా వారిని వదలకూడదనే ఉద్దేశంతో ముంబయి పోలీసులు కొత్త టెక్నిక్‌ను కనుగొన్నారు. ఈ టెక్నిక్‌నే ఇతర నగరాల్లోనూ అమలు చేసే దిశగా వెళుతున్నారు. సరైన పత్రాలు లేకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఆన్‌లైన్‌లో జరిమానాను చెల్లించే వెసులుబాటును కల్పించారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులు ఫ్రీఛార్జ్ వాలెట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ట్రాఫిక్ పోలీసులు సుమారు 500 ఈ -చలాన్ పరికరాలను కొనుగోలు చేశారు. ట్రాఫిక్‌లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి పట్టుబడిన వారి మొబైల్‌కు ఈ-చలాన్ పరికరాల ద్వారా చలానా మొత్తాన్ని పంపిస్తారు. అనంతరం ఆ వ్యక్తి జరిమానా మొత్తాన్ని ముంబయి పోలీసు వెబ్‌సైట్‌లో ఫ్రీఛార్జ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా చెల్లింపుల సంఖ్య పెరగడంతో పాటు మరో ఉపయోగం కూడా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పదే పదే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిని కూడా సులువుగా గుర్తించవచ్చని చెబుతున్నారు.