: మూడు టెలికాం ఆపరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖేష్ అంబానీ
పోటీ తత్వాన్ని తట్టుకోలేక ఇతర టెలికాం కంపెనీలు కుట్రలకు పాల్పడుతున్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారులు జియోపై ఎనలేని అభిమానాన్ని చూపుతున్నప్పటికీ... మిగతా ఆపరేటర్ల నుంచి సరైన సహకారం అందడం లేదని ఆరోపించారు. దేశంలోని మూడు అతి పెద్ద టెలికాం కంపెనీలు గత మూడు నెలల్లో దాదపు 900 కోట్ల వాయిస్ కాల్స్ ను బ్లాక్ చేశాయని ముఖేష్ విమర్శించారు. అత్యున్నతమైన జియో టెక్నాలజీ కస్టమర్లకు చేరకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. అయినప్పటికీ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు జియో కృషి చేస్తోందని చెప్పారు. గతంలో 90 శాతంగా ఉన్న డ్రాప్ కాల్స్ ను... ప్రస్తుతం 20 శాతానికి తగ్గించేశామని వెల్లడించారు. తమ వినియోగదారులకు దేశవాళీ వాయిస్ కాల్స్ ను ఉచితంగా అందించేందుకు జియో కట్టుబడి ఉందని చెప్పారు.