: పెళ్లి ఖర్చులు సమర్పించిన గాలి జనార్దన్‌రెడ్డి.. పరిశీలిస్తున్న ఐటీ అధికారులు
కుమార్తె పెళ్లితో మరోమారు దేశం దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఆదాయపు పన్ను శాఖను నిద్రలేపిన అక్రమ గనుల కేసు నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి.. కుమార్తె పెళ్లి ఖర్చుల వివరాలను ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అందించారు. తాము అడిగిన 15 ప్రశ్నలకు గాలి జనార్దన్‌రెడ్డి పూర్తి సమాధానాలు ఇచ్చినట్టు ఐటీ అధికారులు తెలిపారు. పెళ్లి మండపం అలంకరణ నుంచి పురోహితులకు చెల్లించిన మొత్తం వరకు అన్ని వివరాలను అందించారు. గాలి సమర్పించిన వివరాలను అధికారులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. తమ వద్ద ఉన్న వివరాలకు, గాలి సమర్పించిన వివరాలకు కొన్ని చోట్ల పొంతన కుదరడం లేదని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే మరోమారు జనార్దన్‌రెడ్డిని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.