: రాజకీయ పార్టీలు ముస్లింలకు టోపీ పెడుతున్నాయి.. సినీ నటుడు అలీ ధ్వజం
రాజకీయ నాయకులు తాము టోపీలు పెట్టుకోవడమే కాకుండా ముస్లింలకు కూడా టోపీలు పెడుతున్నారని ప్రముఖ సినీ నటుడు, హీరో, కమెడియన్ అలీ విమర్శించారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో నిర్వహించిన 'జాగో ముస్లిం.. చలో గుంటూరు' పేరుతో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి అలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే ముస్లింలు ఓటేయాలని పిలుపునిచ్చారు. ముస్లింల పర్వదినమైన రంజాన్ రోజునే రాజకీయ నాయకులకు ముస్లింలు గుర్తొస్తారని విమర్శించారు. ఆరోజు వారు తలపై టోపీలు పెట్టుకోవడమే కాకుండా ముస్లింల నెత్తిపైనా టోపీలు పెడుతున్నారని అన్నారు. చదువుతోనే ప్రగతి సాధ్యమని, బలవంతపు మతమార్పిడులు మంచివి కావని సూచించారు. ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన అలీని సంఘ నాయకులు, అభిమానులు గజమాలతో సత్కరించారు.