: అభిమానం ఇక్కడే ఉండిపొమ్మంటోంది.. బాధ్యతలు ఏపీ వెళ్లమంటున్నాయి: సీఎం చంద్రబాబు
‘తెలంగాణలో అభిమానం చూస్తుంటే ఇక్కడే ఉండిపొమ్మంటోంది.. బాధ్యతలేమో ఏపీ వెళ్లమంటున్నాయి’ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల్లోను రాజకీయ చైతన్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీయే నని, బలహీన వర్గాలకు తమ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల కోసం పోరాడతామని అన్నారు. రాష్ట్రంలో నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవశ్యకత ఉందని, గ్రామస్థాయిలో కమిటీలు వేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో కన్నా తెలంగాణలోనే టీడీపీకి మంచి నాయకత్వం ఉందని అన్నారు. మంచి నాయకత్వంతో పాటు నిర్మాణం ఉంటేనే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని, నాయకుల మధ్య సమన్వయం ఎంతో అవసరమని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యలపై మరింతగా పోరాడాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యలపై నేతలు ఏ మేరకు పోరాడుతున్నారనే సమాచారం తనకు ఎప్పటికప్పుడు వస్తోందన్నారు. ప్రస్తుతం తనకు కొంత వెసులుబాటు లభించిందని, పార్టీకి మరింత సమయం కేటాయిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.