: ‘నిమ్స్’లో రోగుల కుటుంబాలకు ‘చిల్లర’ పంపిణీ చేసిన ‘జనసేన’
పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ‘చిల్లర’ సమస్యతో సతమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, ఆసుపత్రుల్లోని పేద రోగుల కుటుంబాలకు చిల్లర దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు తమ దయాగుణం చూపించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని ‘నిమ్స్’లో రోగుల కుటుంబాలకు ‘చిల్లర’ పంపిణీ చేశారు. నిమ్స్ లోని ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా ఉన్న విశ్రాంతి శాలలో రోగుల కుటుంబాలు తీసుకువచ్చిన రూ.500, రూ.1000 నోట్లకు ‘చిల్లర’ ఇచ్చి ఆదుకున్నారు. సుమారు రూ.25 వేల వరకు చిన్ననోట్లు పంపిణీ చేశారు. పెద్దనోట్లను మార్చుకునేందుకు చాలామంది ఆసక్తి కనబరిచారు. తెచ్చిన చిన్ననోట్లు అయిపోవడంతో మళ్లీ వస్తామని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్లిపోయారు. కాగా, నోట్ల మార్పిడి కారణంగా ఆసుపత్రి ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని జనసేన పార్టీ కార్యకర్తలకు ఆసుపత్రి వర్గాలు సూచించినట్లు సమాచారం.