: మోదీని ‘అంకుల్ పోడ్గర్’ పాత్రతో పోల్చిన లాలూ!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో విమర్శించారు. జెరొమ్ కె జెరొమ్ రచించిన ఇంగ్లీషు నవల ‘త్రీ మెన్ ఇన్ బోట్’ లో ‘అంకుల్ పోడ్గర్’ పాత్రతో మోదీని ఆయన పోల్చారు. పనులన్నీ గజిబిజిగా చేసే అంకుల్ పోడ్గర్, ఆ బాధ్యతలను ఇతరులపైకి నెట్టివేస్తారని, ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా అదే పాత్ర పోషిస్తున్నారని లాలూ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతాలో విమర్శించారు. అన్నీ తెలిసిన అనుభవజ్ఞులు ఎటువంటి హడావుడి లేకుండా, విజయవంతంగా పనులన్నీ పూర్తి చేస్తారని, సగం పరిజ్ఞానం ఉన్నవారు మాత్రం హడావుడి చేయడం తప్పా, పనులు పూర్తి చేయరనే దానిని ‘అంకుల్ పోడ్గర్’ పాత్ర చెబుతుందని, ఆ పాత్రను మోదీ పోషిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెద్దనోట్లపై మోదీ తీసుకున్న నిర్ణయంతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థికశాఖ, ప్రభుత్వం, ప్రజలు, రైతులను ఇబ్బంది పెడుతున్నారని లాలూ అన్నారు.