: తమిళ నిర్మాత కేసులో ట్విస్ట్... పోలీసుల విచారణకు ఇద్దరు భార్యలను పిలిస్తే, మూడో భార్యనంటూ మరో యువతి సిద్ధం!
ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి 123 మంది నుంచి రూ. 85 కోట్లు నొక్కేసిన కేసులో గత మంగళవారం తిరుపూర్ లో అరెస్టయిన తమిళ చిత్ర నిర్మాత, వేందర్ మూవీస్ అధినేత మదన్ కేసులో కొత్త ట్విస్ట్ కనిపించింది. ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు పలు విషయాలు తెలిసినట్టు సమాచారం. వాటిని ఖరారు చేసుకునేందుకు మొదటి భార్య సింధూజ, రెండో భార్య సుమలతలను స్టేషన్ కు పిలిపించిన వేళ ఆసక్తికర ఘటన జరిగింది. తాను మదన్ మూడో భార్యనంటూ వర్ష అనే యువతి అక్కడికి వచ్చి సింధూజ, సుమలతలతో వాగ్వాదానికి దిగింది. తననూ విచారించాలని పట్టుబట్టింది. ఇక మదన్ తీసుకున్న డబ్బుతో ఏం చేశాడు? దాన్ని ఎవరికి ఇచ్చాడు? ఎక్కడ దాచాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు పోలీసులు 300 ప్రశ్నలతో కూడిన జాబితాను తయారు చేసి ఆయన్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఫోన్ ను పరిశీలించిన పోలీసు వర్గాలు, కనీసం 20 మంది మహిళలతో మదన్ సంబంధాలు కలిగివున్నాడని గుర్తించి, వారిని కూడా విచారించాలని నిర్ణయించారు. కాగా, ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం చెన్నై కోర్టు మదన్ కు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించగా, నిన్నటి నుంచి విచారణ మొదలైంది.