: కారు కొంటానని అంటూ వచ్చి.. కారుతో మాయమైన వ్యక్తి!
ఓఎల్‌ఎక్స్ లో విక్రయానికి పెట్టిన పాతకారును కొనుక్కుంటానని వచ్చిన ఓ వ్యక్తి ఆ కారుతో ఉడాయించిన ఘటన హైదరాబాదులోని కేపీహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదు, సోమాజీగూడలో నివసించే శ్రీకాంత్ (49) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. 2015 మోడల్‌కు చెందిన తన వెంటో కారు (టీఎన్ 09 ఈఎఫ్ 9727) ను అమ్మేయాలని భావించిన శ్రీకాంత్ ఓఎల్‌ఎక్స్ లో విక్రయానికి యాడ్ ఇచ్చాడు. ఓఎల్ఎక్స్ లో ఇచ్చిన యాడ్ ను చూశానంటూ ఓ వ్యక్తి శ్రీకాంత్ ను కలిశాడు. కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముండే తాను ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం పరీక్షిస్తానంటూ (ట్రయల్ రన్) శ్రీకాంత్ తో పాటు కారులో కేపీహెచ్‌బీకి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఫోరంమాల్ సమీపంలోని తాళం వేసిన ఓ ఇంటిని చూపించి, అదే తానుండే నివాసం అని చెప్పాడు. అక్కడి నుంచి ఫోరంమాల్ లోని కాఫీ షాప్ కు వెళ్లి కాఫీ తాగుదామంటూ కోరాడు. కారుకొంటున్నాడు కదా అన్న ఆలోచనతో శ్రీకాంత్ అతనితోపాటు వెళ్లాడు. కాఫీ తాగుతూ ఫోన్ లో మాట్లాడుతున్నట్లు నటించిన ఆ వ్యక్తి, తాళాలతో పాటు మాయమయ్యాడు. దీంతో ఫోన్ మాట్లాడిన తర్వాత వస్తాడు కదా అంటూ వెయిట్ చేసిన శ్రీకాంత్, కాసేపటికి అతను వెనక్కి రాకపోవడంతో... పార్కింగ్ లో పెట్టిన కారును చూసుకున్నాడు. అక్కడ కారు కనిపించలేదు. దీంతో షాక్ తిన్న శ్రీకాంత్ నేరుగా కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ వ్యక్తి చేసిన ఫోన్ నెంబర్ ను పరిశీలించగా, అది కర్ణాటకకు చెందిన నెంబర్ గా తేలింది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు.