: టీడీపీ నాయకుడు అమర్ నాథ్ పై మరో టీడీపీ నాయకుడి దాడి
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ నాయకుడు నల్లపనేని అమర్ నాథ్ పై అదే పార్టీకి చెందిన వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈరోజు సాయంత్రం జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కనకారావు తన అనుచరులతో ఆటోలో వెళ్లి అమర్ నాథ్ పై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. విజయవాడ-గుంటూరు రోడ్డులో అమర్ నాథ్ నిర్వహిస్తున్న న్యూగీత హోటల్ ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. అయితే, ఏ విషయమై వారి మధ్య వివాదాలు నెలకొన్నాయనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయనే వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ విషయమై టీడీపీకి చెందిన కనకారావుకి, అమర్ నాథ్ కు మధ్య నిన్న ఘర్షణ జరిగిందని, కనకరావుపై అమర్ నాథ్ దాడి చేశారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కనకరావు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.