: గాండ్రించిన తర్వాత తెలిసింది.. అది పులి అని!
ఇంట్లో వాళ్లందరూ ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత టీ తాగుతూ కూర్చున్నారు. ఇంతలో, ఒక గదిలోకి ఏదో జంతువు వెళ్లింది. అది కుక్క అయి ఉంటుందని అనుకున్నారు. కొద్ది సేపటి తర్వాత గాండ్రింపు వినపడటంతో అప్పుడు తెలిసింది.. అది కుక్క కాదు పులి అని. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ కు 30 కిలోమీటర్ల దూరంలోని మల్పూర్ ఖాజురియా అనే గ్రామంలో జగదీశ్ అనే వ్యక్తి ఇంట్లో ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్ ప్రసాద్ మాట్లాడుతూ, దట్టమైన మంచు కారణంగా, ఇంట్లోకి వచ్చిన జంతువు ఏదో సరిగ్గా గుర్తించలేకపోయామని, సాధారణంగా కుక్కలు వస్తుంటాయని.. దీంతో, అదే ఆలోచన చేశామని చెప్పారు. తీరా, దాని గాండ్రింపు విన్న తర్వాత పులి అని తెలిసి, ఆ గది తలుపు వెంటనే వేసేశామన్నారు. సంబంధిత అధికారులకు సమాచారమివ్వడంతో, సుమారు గంటన్నర పాటు వారు శ్రమించి, పులిని బంధించారన్నారు. పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకుని అడవిలో వదిలేశారని జగదీశ్ చెప్పారు.