: నాలుగేళ్లు శిక్షణ తీసుకుంటే తప్ప ఈ చేప వండడం చేతకాదు... జపనీయులకిది చాలా ఇష్టం!
జపనీయులు అమితంగా ఇష్టపడే చేపకూర వండేందుకు కనీసం నాలుగేళ్ల ప్రత్యేక శిక్షణ అవసరమంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. జపాన్ లో అత్యంత ఖరీదైన ఈ చేపను వండేందుకు ప్రత్యేకమైన చెఫ్ లతో కూడిన రెస్టారెంట్లు కూడా తక్కువే ఉన్నాయి. అయినప్పటికీ వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇంతకీ ఆ చేప విశేషాల్లోకి వెళ్తే... లాగొసెఫలస్ జాతికి చెందిన పుఫ్పర్ ఫిష్ ను జపనీయులు ‘ఫుగు’ అని పిలుస్తారు. దీనిని వారు చాలా ఇష్టపడతారు. ఈ చేప అత్యంత విషపూరితమైనది. దీని కాలేయం, కళ్లు, ఇతర అవయవాల్లో టెట్రొడొటాక్సిన్ అనే విషపదార్థం ఉంటుంది. ఇది సైనైడ్ కన్నా 1200 రెట్లు అధికంగా ప్రభావం చూపుతుంది. ఈ విషం శరీరంలోకి ప్రవేశించిన క్షణాల్లో... మనిషి కండరాల కదలిక ఆగిపోయి, వూపిరి ఆడక చనిపోతారు. ఇంత ప్రమాదకరమైన ఈ చేపను తినేందుకు జపనీయులు చాలా ఆసక్తి చూపుతారు. దీంతో దీనిని వండేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్ లను నియమించుకుంటారు. ఈ చేపను గుర్తించడం, కోయడం, శుభ్రం చేయడంలో మూడేళ్లు, వండడంలో కనీసం ఏడాది...ఇలా మొత్తం నాలుగేళ్ల శిక్షణ పొంది ఉండాలి. ఆ తరువాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులకు మాత్రమే ఈ చేపను వండేందుకు అనుమతి ఇస్తారు. వారిని మాత్రమే రెస్టారెంట్లు చెఫ్ లుగా నియమించుకుంటాయి. అనుభవం లేకుండా ఫుగు చేపతో వంటకాలు చేస్తే తినేవారికి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంది. జపాన్ లో ఈ వంటకం చాలా ఖరీదైనది. జపాన్ లో ఈ వంటకాన్ని అందించే రెస్టారెంట్లు కూడా తక్కువనే చెప్పాలి.