: వధువు వద్దకు ఏకంగా హెలికాప్టరే పల్లకిగా వచ్చేసింది!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఎన్నో వివాహ వేడుకలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొందరు మాత్రం ఎన్నో ఇబ్బందులు పడి పెళ్లి వేడుక జరిపించుకుంటున్నారు. అయితే, గురగ్రామ్ నగరంలో జరిగిన ఓ పెళ్లి మాత్రం అందుకు విభిన్నం. పెళ్లికూతురికి మరింత మధురానుభూతులను మిగిల్చింది. ఎందుకంటే ఓ వధువు కోసం వరుడు పెళ్లి పల్లకిలా హెలికాప్టర్ పంపించాడు. పెళ్లికొడుకు వినోద్ వాట్స్ (25) తాను తాళి కట్టబోయే లలితను తన ఇంటికి తీసుకువచ్చేందుకు ఈ విధంగా ఏర్పాటు చేశాడు. సంబంధిత అధికారులతో మాట్లాడిన వరుడు హెలికాప్టరు వాడుకునేందుకు అన్ని అనుమతులు తీసుకొని తనకు కాబోయే శ్రీమతిని అందులో తెచ్చుకున్నాడు. వధువు గ్రామమైన బాద్షాపూర్ నుంచి ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ హెలికాఫ్టర్ బయలుదేరి వెళ్లింది. గురుగ్రామ్ లోని దుందేహేరా ప్రాంతానికి చెందిన వినోద్ తండ్రి బాబులాల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి. తన కుమారుడి వివాహవేడుకని వినూత్నంగా నిర్వహించాలని అనుకున్నానని, అందుకే వధువుని ఈ విధంగా తీసుకొచ్చామని ఆయన చెప్పాడు. ఈ హెలికాప్టరును ఉపయోగించడానికి తాము అద్దెగా రూ.2 లక్షల చెక్కును ఇచ్చామని అతడి మిత్రుడు పవన్ కుమార్ మీడియాకు తెలిపాడు.