: ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు.. సర్వేలో నమ్మశక్యం కాని నిజాలు

చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అని భావించే భారతదేశంలో అదే చిన్నారుల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతంగా మారుతున్నాయి. వారి బాధ‌లు చూస్తోంటే మ‌నిష‌న్న వాడు క‌న్నీరు పెట్టుకోక మానడు. అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వారి అందమైన బాల్యం, నవ్వుల పువ్వులు పూయాల్సిన వారి ముఖాలు ఏడుపుతో, చెప్పుకోలేని బాధ‌తో క‌న‌ప‌డుతున్నాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప‌సివారి పరిస్థితి మ‌రీ దారుణంగా మారింది. 'ప్లాన్‌ ఇండియా' అనే ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వేలో స‌భ్య‌స‌మాజం త‌లదించుకునే ప‌లు విషయాలు వెలుగు చూశాయి. నమ్మశక్యం కాని నిజాలు బయటపడ్డాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటే మాన‌వ‌త్వం ఎటుపోతోంది? అనే ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లుగుతోంది. సెకనుకో చిన్నారి వేధింపుల బారిన పడుతోందని స‌ర్వేలో తేలింది. ‘ఇబ్బందిక‌ర‌ పరిస్థితుల్లో చిన్నారులు’ పేరిట చిన్నారుల బ‌తుకుల‌పై ఎన్జీవో ఓ నివేదిక‌ అందించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స‌ద‌రు ఎన్జీవో 90 రోజుల పాటు 2 వేల సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి 1500 మంది ఈ స‌ర్వే చేశారు. ఈ స‌ర్వేలో చిన్నారుల‌పై లైంగిక వేధింపులేగాక‌, ప‌లు అంశాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దేశంలో జ‌రుగుతున్న‌ మొత్తం మానవ అక్రమ రవాణా నేరాల్లో అండమాన్‌, నికోబార్‌ దీవులు, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ల్లో 61 శాతం నేరాలు జ‌రుగుతున్నాయ‌ని తేలింది. ఆయా రాష్ట్రాల్లో క‌నిపించ‌కుండా పోయిన ప‌సివారిలో 48 శాతం మంది ఆచూకీ తిరిగి దొర‌క‌డం లేదు. స‌ర్వేలో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం రాజస్థాన్‌లో బాల్య వివాహాలు అధికంగా జ‌రుగుతున్నాయి. 20–24 ఏళ్ల మహిళల వివ‌రాలు సేక‌రించ‌గా వారిలో 57.6 శాతం మంది వివాహాలు వారికి 18 ఏళ్లు రాక‌ముందే జరిగాయని తేలింది. ఇక యూపీలో 54.9, హర్యానాలో 28 శాతం బాల్య వివాహాలు జ‌రుగుతున్నాయ‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. అలాగే యూపీలో బాలకార్మికుల సంఖ్య దేశంలోకెల్లా అత్య‌ధికంగా ఉంది. భార‌త్‌లో మొత్తం 43 లక్షల మంది బాలకార్మికులు ఉంటే వారిలో 18 లక్షల మంది ఆ రాష్ట్రంలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News