: తెలంగాణ ఉద్యోగులకు రూ. 10 వేలిచ్చి సర్దుతారట... కేసీఆర్ వద్దకు ఫైల్
మరో వారంలో వస్తున్న ఒకటో తారీఖును చూసి సామాన్యులతో పాటు ప్రభుత్వం సైతం భయపడుతోంది. ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాల్సి రావడం, చేతిలో చాలినంత నగదు లేకపోవడంతో ఒక్కోక్కరికి రూ. 10 వేల నగదు ఇచ్చి సర్దాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు నేరుగా వేతనాలను విత్ డ్రా చేసుకునే పరిస్థితి లేకపోవడంతో కనీసం రూ. 10 వేలు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేయాలన్న ఫైల్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. జీతాలను నేరుగా చెల్లించడం వీలు కాదని ఆర్థిక శాఖ తేల్చి చెప్పిన కారణంగా, బ్యాంకులతో ముందస్తు సంప్రదింపులు జరిపి, ఉద్యోగులు ఏ బ్రాంచీకి వెళ్లయినా రూ. 10 వేలను విత్ డ్రా చేసుకునేలా, ఇందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని, మరో మార్గంగా ప్రభుత్వ ఆఫీసుల్లోనే మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేసి డబ్బులివ్వాలని కూడా సిఫార్సులు చేసినట్టు తెలుస్తోంది. సీఎం నిర్ణయం మేరకు నగదు ఏ రూపంలో చెల్లించాలన్న విషయమై స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.